నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్   

అమృత సింగ్ ను అభినందించిన కలెక్టర్​

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 2న న్యూఢిల్లీ నోయిడాలో నిర్వహించిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఇండియా పోటీల్లో ఓపెన్ కేటగిరీ 245 కిలోల విభాగంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ సాగర్ అమృత్ సింగ్ మొదటి బహుమతి సాధించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్​లో  అమృత్ సింగ్ ను కలెక్టర్​ అభినందించారు. జాతీయ స్థాయిలో  సాగర్ అమృత్ సింగ్ సాధించిన ఫస్ట్ ప్రైజ్ ను ఆమె బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తూ పవర్ లిఫ్టింగ్ లో జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. 

అలసత్వం వహిస్తే చర్యలు

పెన్ పహాడ్, వెలుగు : విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పెన్ పహాడ్, అనంతారం, సింగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలను ఆయన ఆకస్మికంగా చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీల నిర్వహణ తీరు, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. రాబోయే ఎండాకాలంలో నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలని, తాగునీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.  

ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి 

హుజూర్ నగర్, వెలుగు : ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేలా అంగన్​వాడీ టీచర్లు పనిచేయాలని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింహారావు అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ ఐసీడీఎస్ ఆఫీస్ లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని 9వ అంగన్ వాడీ కేంద్రాన్ని ఆయన విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్​వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేసి పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వేతనాలు పెంచాలి

సూర్యాపేట, వెలుగు :  ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని హెచ్ పీసీఎల్​ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ డిమాండ్​చేశారు. ఈ మేరకు హెచ్ పీసీఎల్ వద్ద మంగళవారం డ్రైవర్లు, హెల్పర్లు సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లకు రోజుకు రూ.1000, హెల్పర్లకు రూ.700- వేతనం ఇవ్వాలన్నారు. హెచ్​పీసీఎల్ అధికారులు ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కలిసి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెండున్నర సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే ట్యాంకర్ల యజమానులు అంగీకరించక‌‌‌‌‌‌‌‌పోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు.  

ఎస్సారెస్పీ నీరు అందించాలి

తుంగతుర్తి, వెలుగు : ఎస్సారెస్పీ జలాలు పంట పొలాలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల ఒకటో తారీఖు నుంచి ఎస్సారెస్పీ జలాలను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ తమ గ్రామానికి నీళ్లు ఇంకా రాలేదన్నారు. రైతులకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  

సమ్మెను విరమించిన ఉద్యోగులు 

నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెను విరమించారు. మంగళవారం నల్గొండలోని కలెక్టరేట్ లో ఏవో మోతీలాల్, డీఈవో భిక్షపతిని కలిసి సమ్మె విరమణ నోటీసులు అందజేసి విధుల్లో చేరుతామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి జనవరి 6 వరకు 28 రోజులు నిర్వహించిన నిరవధిక సమ్మెకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల పే స్కేల్ అమలుపై కేబినెట్ సబ్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారని వివరించారు.

కోనేరులో పడి బాలుడు మృతి 

కోదాడ, వెలుగు : కోనేరులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన కోదాడ మండలం గుడిబండలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ అనిల్ రెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని చార్మినార్ కు చెందిన మహమ్మద్ అఫ్రిన్ తన కుమారుడు మహమ్మద్ సౌద్(5) తో కలిసి గుడిబండలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యారు. బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న కోనేరులో పడిపోయాడు. తల్లి గమనించి వెంటనే స్థానికులు చెప్పడంతో నీటిలో నుంచి బాలుడిని బయటికి తీసి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.